Popular Posts

29, నవంబర్ 2013, శుక్రవారం






విశ్వమనే ఫ్లాట్ ఫారం
అక్కడ వేచి ఉండే సమయం కొన్ని యుగాల్లాగా గడుస్తుంది
హడావిడిగా లోపలికొచ్చే యువకులు సంచుల నిండా ఆశల్ని,ఆకాంక్షల్ని నింపుకొని వస్తారు
వలసవెళ్ళే కూలీలు గోతాల నిండా పల్లె పరిమళాలను దాచుకునివస్తారు
ఎంక్వైరీ కౌంటరు,బుకింగ్ ఆఫీసు కొంత సేపు ఆక్సిజను అందక అవస్త పడతాయి
క్యూ తన అర్థాన్ని కోల్పోయి బిక్క మొహం వేస్తుంది
ఆత్రుత నిండిన ముఖాలు అదుపు తప్పిన లారీల్లా జన ప్రవాహంలో పరిగెడతాయి
అనౌన్సుమెంటు గొంతు నిర్వికారంగా ట్రైను రాక చెపుతుంది
అన్ని చెవులు లౌడు స్పీకరుకు అతుక్కుంటాయి,కొన్ని కళ్ళు పట్టాల అంచులదాకా పరిగెడతాయి
రైలు కన్నా ముందే దాని శబ్దం, ఫ్లాట్ ఫారాన్ని ఆక్రమిస్తుంది
రైలు ఆగినవెంటనే ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు బద్ధశత్రువుల్లా కలబడుతారు
కొన్నివేల ఈగలు రైలు రాకతో పైకి లేచి ప్రయాణీకుల్ని దుమ్ములా కమ్ముకుంటాయి
అంతకుముందు దాకా విశాలంగా ఉన్న పరిసరాలు కుచించుక పోయి
దురాక్రమణకు గురైన భూముల్లా మాయమవుతాయి
బండ్ల మీద అరటి పండ్లు,నీళ్ళ బాటిళ్ళూ రెక్కలొచ్చి ఎవరి వొళ్ళోనొవాలిపొతాయి
కాఫీలు టీలు దోశలు వడలు క్షణాల్లొ దవడల క్రింద నలిగిపొతాయి
తాడుకు వేళ్ళాడే పత్రికలు పసిపిల్లల్లా పాఠకుల చేతుల్లొకి గెంతుతాయి
నిశ్శబ్దంగా ఉన్న మైకు బయల్దేరే టైమైందని హడావిడి చేస్తుంది
చీరలు ,పేంట్లు,చుడిదార్లు,పంచెలు అడ్డగోలుగా అటు ఇటు పరిగెడతాయి
వంతెన మెట్లు నిండి ప్రవహిస్తుంది ,ఎర్ర చొక్కాలు లగెజి పర్వతాలై అందర్నీ తోసుకుంటూ నడుస్తాయి
వేదనకు, రోదనకు,హాసానికి,మోసానికి, అత్రానికి, ఆవేశానికి
కొద్ది క్షణాలు సాక్ష్యాలవుతాయి
అప్పుడు  కాలం క్షణాల్లోకి మారి ఉత్కంఠ భరిత సన్నివెశమవుతుంది
సీట్లకు చేరిన టిక్కట్లు గూటికి చేరిన పక్షుల్లా కుదుటన పడతాయి
కిటికీలకు అతుక్కున్న మొహాలు,ఊపుతున్న చేతులు
ట్రైనుకు కట్టిన తోరణాల మల్లే ఉంటాయి
దారంతా బాగులు, సూటుకెసులు మందుపాతరల్లాగ అడ్డగిస్తాయి
కరచాలనాలు, దరహాసాలు కన్నీటి వాగులు వడి వడిగా  ప్రవహిస్తాయి
సంకేతానికి సమ్మొహితురాలైన  రైలు భారంగా
ప్లాటుఫారాన్ని వదలలెని ప్రేమికుడిలాముందుకు కదులుతుంది
వదిలించు కున్నామన్న సంతోషంతొ కొన్ని ముఖాలు, అయ్యొ వదిలిపొతున్నామే అన్న
విషాదంలొ కొన్ని తలలు నిష్క్రమిస్తాయి
విసిరేసిన ఆకులు,వదిలేసిన కాగితాలు గాలికి ఎగురుతు టాటా చెపుతాయి
ఉప్పెన తర్వాత ఊరిలాగ ప్లాటుఫారం బోసిపొతుంది
మళ్ళీ కొన్ని యుగాల నిరీక్షణకు  తెర లేస్తుంది   
ఇంకో రైలు వచ్చేవరకు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి